అంగన్వాడి నాయకుల అరెస్ట్

అంగన్వాడి నాయకుల అరెస్ట్

విశ్వంభర, అంబర్‌పేట : అంగన్వాడి వర్కర్లు, హెల్పర్స్ యూనియన్ నిర్వహించిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, కోశాధికారి మంగాన్ని పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యుడు మహేందర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నాయకులను పరామర్శించారు. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి వారిని విడుదల చేయించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అంగన్వాడీలకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యపద్ధతిలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడం దుర్మార్గమని విమర్శించారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మశ్రీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కేవీపీఎస్ నగర కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags: