జాతీయ పోటీలో తుమ్మలూరు విద్యార్థుల ప్రతిభ
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం తుమ్మలూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించిన, ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించారు. ఒకే ప్రభుత్వ పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి ఉపకార వేతనానికి అర్హత సాధించడం అరుదైన ఘనతగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులలో దాగి ఉన్న మేధస్సు, సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలను గుర్తించి, వారి ఉన్నత చదువులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఢిల్లీ ఆధ్వర్యంలో ఈ జాతీయ స్థాయి పోటీ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పోటీ పరీక్షలో విజయం సాధించిన ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.48,000 చొప్పున నగదు ఉపకార వేతనంతో పాటు మెరిట్ సర్టిఫికెట్ అందజేయనున్నారు, ఇది వారి విద్యాభ్యాసాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు బలమైన ఆర్థిక సహాయంగా నిలవనుంది. తుమ్మలూరు ప్రభుత్వ పాఠశాల నుండి రాజమోని కుమార్, లాచులూరి రోహిత్, మంచాల బిందు ప్రియ ఈ ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలప్రధానోపాధ్యాయులు చంద్రమౌలి మాట్లాడుతూ, తుమ్మలూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ జాతీయ స్థాయి ఫలితాలతో పాటు ఈ సంవత్సరం మండల స్థాయిలో నిర్వహించిన మ్యాథ్స్ సైన్స్ టాలెంట్ టెస్టుల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి సంబంధించిన వివిధ పోటీ పరీక్షల్లోనూ మంచి ప్రతిభ చూపుతూ ఉచిత కళాశాల అవకాశాలను సాధిస్తున్నారని పేర్కొన్నారు, ఈ విజయాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు బలంగా ఉన్నాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు అందేలా నిరంతరం ప్రోత్సహిస్తూ, ప్రతి సంవత్సరం పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను గురుకుల, ఎంజేపీటీ , సోషల్ వెల్ఫేర్, డి ఆర్ డి ఎ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ, ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశం పొందేలా వారి ఉన్నత చదువులకు సహకారం అందిస్తున్న పాఠశాల పూర్వ విద్యార్థి కటికల యాదగిరికి అభినందనలు తెలిపారు.



