పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ భారత్
విశ్వంభర, హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహిస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా వరంగల్ ఓ-సిటీలో భారీ పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ఓ-సిటీ ప్రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు వరంగల్ కుడా ఛైర్మన్, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కుడా ఛైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గ్రామం, ప్రతి డివిజన్ అభివృద్ధి పథంలో నడవాలన్నదే ఈ 99 రోజుల ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఓ-సిటీ అసోసియేషన్ సభ్యులు చూపిస్తున్న చొరవ అభినందనీయమని, కాలనీల అభివృద్ధికి కుడా తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పారిశుధ్య కార్మికులతో కలిసి ఆయన కాలనీ వీధుల్లో తిరుగుతూ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛ భారత్ కేవలం ఫోటోల కోసం కాదని, పారిశుధ్య కార్మికులతో కలిసి పనిచేస్తూ వారికి గౌరవం కల్పించడం అని, కాలనీవాసులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమేనని పేర్కొన్నారు. ఓ-సిటీ ప్రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరిక మేరకు వెంటనే స్పందించి వచ్చి పాల్గొనందుకు అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ-సిటీ ప్రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, కాలనీ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



