శ్రీసీతారామ కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం
విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్ లో ప్రసిద్ధి చెందిన అతి పురాతనమైన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 27వ తేదీన నిర్వహించబోతున్న 35వ సంవత్సర శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఆలయ కమిటీ చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డి తెలిపారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి శుక్రవారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు పునర్వసు నక్షత్ర శుభలగ్న ముహూర్తమున గ్రామ పెద్దలందరి ఆధ్వర్యంలో పురోహితులు వెంకటేశ్వర శర్మ ,ఆలయ పూజారి ప్రభాకర్ శర్మ పర్యవేక్షణలో అత్యంత వైభవోపెతంగ నిర్వహిస్తున్నామన్నారు. 27వ తేదీ ఉదయం 6:15 నిమిషాల నుంచి గణపతి పూజ,పుణ్య వాచన, శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుందన్నారు. సాయంత్రం ఏడున్నర గంటల నుంచి భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుందని బొబ్బల లక్ష్మారెడ్డి తెలిపారు.శనివారం ఉదయం 5:30 గంటల నుంచి శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, మేలుకొలుపు, శ్రీ ఆంజనేయస్వామి వారి అభిషేకం ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఊరేగింపుగా జరుపబడుతుందన్నారు. కావున భక్తులందరూ కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారి కృపాకటాక్షకాలు పాత్రులు కావాలని కోరారు. తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని బొబ్బల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.



