నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన అంబేద్కర్ ఆశయ సాధన సభ్యులు
విశ్వంభర, బోడుప్పల్: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 370వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటిపై బిజెపి నాయకులు దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఆ దాడికి నిరసనగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తింటే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి, అంతే కానీ ఇంటిపై టమోటాలు,కోడిగుడ్లతో దాడి చేయడం మహిళలను భయభ్రాంతులకు గురి చేయడం బిజెపి నేతల పనికిమాలిన చర్య అని నత్తి మైసయ్య మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని, తక్షణమే దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ఈ ఘటనపై తక్షణమే స్పందించాలని, బిజెపి నాయకులపై పార్టీ పరంగా చర్యలు తీసుకొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నత్తి మైసయ్య అన్నారు. అదేవిధంగా గరికపాటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరమని తక్షణమే ఆయన తన మాటలు వెనక్కి తీసుకోవాలని నత్తి మైసయ్య గరికపాటిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసయ్య, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటుకల రవీందర్, రాపోలు శ్రీరాములు, బోడుప్పల్ అరుంధతి మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గురుకుల యాకయ్య, పీఎం దాసు, యేసు రాజు, సాయి బండారి, ఏ రాజేష్, జై భీమ్ అజయ్,గరుగుల స్వర్ణరాజ్ తదితరులు పాల్గొన్నారు.



