ర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం

ర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం

  • :టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

విశ్వంభర, హైదరాబాదు : జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయకపోవడం బాధాకరమని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం పలు చట్టాలు చేసినప్పటికీ జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని విస్మరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల రక్షణ, న్యాయవాదుల రక్షణ వంటి చట్టాలు చేయడం అభినందనీయమని పేర్కొంటూనే, చాలా కాలంగా జర్నలిస్టులు కోరుతున్న రక్షణ చట్టాన్ని తీసుకురాకపోవడం తీవ్ర వివక్షకు నిదర్శనమన్నారు. జాతీయ స్థాయిలో ఐఎఫ్‌డబ్ల్యూజే ద్వారా జర్నలిస్టుల రక్షణ చట్టం కోసం పోరాటం కొనసాగుతోందని తెలిపారు. చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఇప్పటికే జర్నలిస్టుల రక్షణ చట్టాలు అమలులో ఉన్నాయని, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చట్టాలపై చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో మాత్రం జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను గత ప్రభుత్వం విస్మరించిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. ఇటీవల బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరమన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్, ఆరోగ్య కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు లేవని, పత్రికలకు ప్రకటన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జర్నలిస్టులు, వారి కుటుంబాలను విస్మరించడం ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Tags: