నాడు హామీలు ఇచ్చారు.. నేడు విస్మరించారు
సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు అవుతా సైదులు
విశ్వంభర, త్రిపురారం: ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇస్తానని అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చి నేడు పూర్తిగా విస్మరించారని తక్షణమే హామీని అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్రిపురారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సెంటర్లో ఆశా సమస్యలపై మండల వైద్యాధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనాకాలంలో సైతం ఆశా వర్కర్ల సేవలు మరువలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయని అలాంటి వారికి చారడ జీతం ఇచ్చి బారెడు కష్టం చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. కరోనా విషాద సమయంలో అయిన వారు దూరం పెట్టిన సందర్భంలో విపత్కర పరిస్థితులలో ఆశా ఉద్యోగులు వారికి చేదోడు వాదోడుగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ బాధ్యతలు నిర్వహించి గ్రామ గ్రామాన వైద్య సేవలు అందించడం జరిగింది. సుదీర్ఘకాలంగా చాలీచాలని జీతాలతో అధిక పని భారంతో తమ విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. తక్షణమే వీరికి ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరిచి పిఎఫ్,ఈఎస్ఐ ఇతర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల జిల్లా నాయకులు సలీమా, అశ్విని, పద్మ,ప్రేమలత, దుర్గమ్మ, దమయంతి, సీతా తదితరులు పాల్గొన్నారు.



