మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం
- : ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు, సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణం కొత్త బస్టాండ్ వద్ద స్థానిక ప్రజలకు, ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రహదారి నియమాలు పాటిస్తూ ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా గమ్యం చేరాలని, డ్రైవర్ బాధ్యతగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాలని అన్నారు. వాహనాలు నడుపుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న పరిస్థితులను అంచనా వేస్తూ, కాలినడకన వెళ్లే వారిని గమనిస్తూ ముందుకు సాగాలని సూచించారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు చక్కని యూనిఫామ్ ధరించాలని, వాహనానికి సంబంధించి అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, డ్రైవర్ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టి రవాణా చేయకూడదని తెలిపారు. డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే రోడ్డుపై ఉన్న పరిస్థితులను అంచనా వేయలేక ప్రమాదాల బారిన పడతారని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని జైలుకు పంపడం, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందాని , ఏప్రిల్ 1వ తేదీ నుండి నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, పట్టణ ఎస్ఐ లు ఏడుకొండలు, ఐలయ్య, స్థానిక పౌరులు ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు.



