మహాలక్ష్మి పథకంతో ఆర్థిక స్వావలంబన

మహాలక్ష్మి పథకంతో ఆర్థిక స్వావలంబన

 

 

  • జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

విశ్వంభర, మహబూబాబాద్: ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేండ్లకుపైగా పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, రూ.10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో  ఆర్టీసీ అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ స్నేహ శబరీష్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి  ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. పలు ప్రభుత్వ పథకాలు మహిళల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వారి పేరిట ఇస్తున్నామని వివరించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామని తెలిపారు. చీరలు మన సంస్కృతికి నిదర్శనమని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మతు పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. స్కూల్ యూనిఫాం వారితో కుట్టించామని పేర్కొన్నారు.  సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని వెల్లడించారు. బ్యాంక్ లింకేజ్ రుణాలు, వడ్డీ లేని రుణాలు  అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్, డీఆర్డీఓ మధుసూదనరాజు,మెప్మా అధికారి విజయ, ఆర్టీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: