ఉచిత బస్సు పథకంతో మహిళలకు ఆర్థిక భద్రత
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: మంగళవారం సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సులో రూ.10వేల కోట్ల ఆదా చేసిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించున కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం వల్ల భారీ స్థాయిలో ఆర్థిక ఆదా జరిగిందని తెలిపారు. 2023 డిసెంబర్లో 9న ప్రారంభమైన ఈ పథకం ద్వారా 290 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, మహిళలు, విద్యార్థులు కలిసి సుమారు రూ 10 వేల కోట్ల మేర ఆదా చేసుకున్నారని తెలిపారు. ఈ పథకం వల్ల మహిళలు తమ రోజువారీ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుని ఆ డబ్బును కుటుంబ అవసరాలు, విద్య, ఆరోగ్యంపై వినియోగిస్తున్నారని కలెక్టర్ వివరించారు. ఉచిత బస్సు సదుపాయం మహిళల ఆర్థిక భద్రతకు పునాది వేస్తోందని చెప్పారు. ఉచిత బస్సు పథకం మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన గొప్ప గౌరవమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆసుపత్రులు, ఉద్యోగాలు, చిన్న వ్యాపారాల కోసం ప్రయాణించే మహిళలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉందని తెలిపారు. బస్సు చార్జీల ఆదా కుటుంబ అవసరాలకు ఉపయోగపడు తుందని, ఈ పథకం కుటుంబాభివృద్ధికి దోహదం చేస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల మహిళలు నెలకు సగటున రూ.5,000 వరకు ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని, బ్యాంకు రుణాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని అన్నారు. అనంతరం మహాలక్ష్మి ఉచితబస్సులో ప్రతిరోజు ప్రయాణించే మహిళలను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, ఆర్డీవో వేణు మాధవ రావు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం సూచరిత, అడిషనల్ డీఆర్డీవో సురేష్, సూర్యాపేట ఆర్టీసీ డిఎం సునీత, కౌన్సిలర్ అరుణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



