అజాగ్రత్తగా వాహనాలు నడపవద్దు

అజాగ్రత్తగా వాహనాలు నడపవద్దు

విశ్వంభర, సిద్దిపేట: రాంగ్‌ సైడ్ డ్రైవింగ్ ప్రాణాపాయానికి దారితీస్తుందని, అజాగ్రత్తగా వాహనాలు నడిపి అమూల్యమైన ప్రాణాలను బలి తీసుకోవద్దని సీపీ రష్మీ పెరుమాళ్ సూచించారు. యువత మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాలకు బానిసలు కావొద్దని హెచ్చరించారు. ములుగు మండలం వంటిమామిడిలోని ఆర్వీఎం మెడికల్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రతా అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సీపీ హాజరై మాట్లాడారు. ప్రతీ ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. తప్పుడు మార్గంలో వెళ్తే అది కెరీర్‌ను, జీవితాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని హెచ్చరించారు. వైద్య వృత్తి  పవిత్రమైందని, ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని సీసీ టీవీ మానిటరింగ్ వ్యవస్థను పరిశీలించారు. భద్రతా దృష్ట్యా నిరంతరం నిఘా కొనసాగించాలని, అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అవగాహన సదస్సులో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, ములుగు ఎస్ఐ రఘుపతి, ఆస్పత్రి మేనేజ్మెంట్, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: