#వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వంభర, మహబూబాబాద్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో వెంకటేశ్వర బజార్ లోని పద్మశాలీ కమ్యూనిటీ హాల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ వైద్య సేవల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మౌనికను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహబూబాబాద్ పట్టణ ప్రజలు అందుబాటులో ఉన్న స్పెషాలిటీ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్, స్థానిక కార్పొరేటర్ గద్దె నీరాజరాణి, తహసీల్దార్, ప్రోగ్రాం అధికారి సారంగం, డాక్టర్ మౌనిక, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఆరోగ్య విద్యా బోధకులు రాజు, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



