ఎస్పీ పట్టణ అధ్యక్షుడిగా మైనం
విశ్వంభర, భద్రాచలం: భద్రాచలం పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) బలోపేతానికి కీలకమైన నిర్ణయం తీసుకుంది. పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడిగా మైనం ఉమామహేశ్వరరావును నియమించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలో నిర్వహించిన బీఎస్పీ ముఖ్య నాయకుల సమావేశంలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు కొండా చరణ్, మైనం ఉమామహేశ్వరరావును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, పట్టణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ, మైనం ఉమామహేశ్వరరావు పార్టీలో చేరడం శుభపరిణామమని తెలిపారు. ఆయన నాయకత్వంలో భద్రాచలం ప్రాంతంలో బీఎస్పీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతి వర్గానికి వారి జనాభా నిష్పత్తి మేరకు సమాన హక్కులు దక్కాలనే లక్ష్యంతో బీఎస్పీ పని చేస్తోందని పేర్కొన్నారు. బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మన్యవర్ కాన్షీరాం ఆశయాలను సాకారం చేయాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుల, మత భేదాలు లేకుండా సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే నినాదంతో పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు. వివక్ష, దోపిడీ లేని సమాజాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ బహుజనులేనని అన్నారు. నూతనంగా నియమితులైన పట్టణ అధ్యక్షుడు మైనం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, భద్రాచలం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తానని, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ ఉన్నత నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.



