తెలంగాణ రాజకీయాల్లో త్వరలోకి జనసేన
- టాలీవుడ్ హీరో తనీష్
విశ్వంభర, సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానుందని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలను త్వరలోనే రూపొందించనున్నట్లు జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్, టాలీవుడ్ హీరో తనీష్ వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ 336 స్థానాల్లో పోటీ చేస్తోందని ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి శశికళ యాదవ్‌కు మద్దతుగా తనీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి శశికళ యాదవ్‌ను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్నేళ్లు గడిచినా ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజల రుణం తీర్చుకునేందుకే జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలకు జనసేన పార్టీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రాబోయే ఎన్నికల్లో 50 శాతం టికెట్లు మహిళలకే కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అడుగుపెట్టనుందని తనీష్ స్పష్టం చేశారు.



