గీతం స్కాలర్ రాంబాబుకు పీహెచ్ డీ

గీతం స్కాలర్ రాంబాబుకు పీహెచ్ డీ

విశ్వంభర, సంగారెడ్డి:  ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థి రాంబాబు గుగులోతును డాక్టరేట్ వరించింది. ‘సంభావ్య క్యాన్సర్ నిరోధక, సూక్ష్మజీవుల నిరోధక కారకాలుగా అజాహెటెరోసైకిల్ కలిగిన ఫార్మకోఫోర్ల రూపకల్పన, సంశ్లేషణ’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయనం ట్యూబులిన్ పై కోల్చిసిన్-బైండింగ్ సైట్ ను నిరోధించే నూతన మైక్రోట్యూబ్యూల్-టార్గెటింగ్ ఏజెంట్ల రూపకల్పన, సంశ్లేషణపై దృష్టి పెట్టినట్టు తెలియజేశారు. ఇది ఇప్పటికే ఉన్న క్యాన్సర్ వ్యతిరేక చికిత్సలతో సంబంధం ఉన్న ఔషధ నిరోధకత, విషాన్ని అధిగమించడానికి ఒక ఆశాజనక వ్యూహంగా పేర్కొన్నారు.డాక్టర్ రాంబాబు సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags: