ఎన్నికల హామీ పేరిట 300 కుక్కల బలి..!!
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: వీధి కుక్కల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు ప్రజలకు హామీ ఇచ్చారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: వీధి కుక్కల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ఆ హామీని అమలు చేసిన తీరు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. హనుమకొండ జిల్లా శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో పంచాయతీ సిబ్బందిని వినియోగించి వీధి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ప్రక్రియలో సుమారు 300 వరకు వీధి కుక్కలు మృతి చెందినట్లు సమాచారం. చనిపోయిన కుక్కలను గ్రామాల శివార్లలోని ఖాళీ ప్రదేశాల్లో పాతిపెట్టినట్టు అధికారులు గుర్తించారు.
ఈ అమానుష ఘటన వెలుగులోకి రావడంతో ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ అనే జంతు సంక్షేమ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు నేరుగా ఈ ఘటనకు బాధ్యులని పేర్కొంటూ సంస్థ సభ్యులు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ కూడా స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కలను ఈ విధంగా క్రూరంగా చంపించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, దానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్థానిక పోలీసులను కోరారు.
ఎన్జీవో ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. శాయంపేట, ఆరేపల్లి గ్రామాల శివార్లలో పాతిపెట్టిన కుక్కల కళేబరాలను వెలికి తీసి పశువైద్యశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. దర్యాప్తు అనంతరం, ఈ ఘటనకు సంబంధించి రెండు గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు సహా మొత్తం తొమ్మిది మందిపై జంతు సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
అయితే గ్రామస్థులు తమ వాదనను వినిపిస్తున్నారు. వీధి కుక్కల దాడులు పెరిగిపోవడంతో పాటు కుక్క కాటు ఘటనలు ఎక్కువవుతున్నాయని వారు చెబుతున్నారు. కొన్ని కుక్కలకు చర్మ సంబంధిత వ్యాధులు ఉండటంతో గ్రామంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, అందుకే ఈ చర్యకు పాల్పడ్డామని గ్రామస్థులు వివరణ ఇస్తున్నారు. అయినప్పటికీ, సమస్య పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గాలను పక్కనపెట్టి, ఈ తరహా క్రూర చర్యలకు పాల్పడటం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.



