మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల
రాష్ట్రవ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు
తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు చివరి దశకు చేరుకుంది. 2026 మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను అధికారికంగా వెల్లడించింది.
విశ్వంభర తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు చివరి దశకు చేరుకుంది. 2026 మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను అధికారికంగా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలోని మెజారిటీ పట్టణాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఆధిక్యంలో ఉండటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్లం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 25,62,639 మంది ఉండగా, మహిళా ఓటర్లు 26,80,014 మంది, ట్రాన్స్‌జెండర్లు 640 మంది ఉన్నారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కార్పొరేషన్ 3,48,051 ఓటర్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 66 వార్డులున్న కరీంనగర్ కార్పొరేషన్ 3,40,580 ఓటర్లతో రెండో స్థానంలో ఉంది.ఇక అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. సూర్యాపేటలో 1,08,848 ఓటర్లు ఉండగా.. అమరచింత మున్సిపాలిటీలో కేవలం 9,147 ఓటర్లతో అత్యల్ప స్థానంలో నిలిచింది.
జనవరి 20న నోటిఫికేషన్?
ఈనెల 12తో ఓటర్ల తుది జాబితా ప్రచురణ పూర్తి కావడంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 16 నుంచే ముఖ్యమంత్రి సహా ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. మరోవైపు ఓటర్లు తమ పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.



