మీసేవా కేంద్రాలపై ఏసీబీ దాడులు
- పలు కీలకపత్రాలు స్వాధీనం
విశ్వంభర, నిజామాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా సుమారు 11 మీసేవా సెంటర్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్లలో అధిక వసూళ్లకు పాల్పడడం, కొన్ని సెంటర్లలో బ్రోకర్లు తిష్టవేసి సర్టిఫికెట్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా వారు గుర్తించారు. ఈ క్రమంలో నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్‌లో ఉన్న మీసేవా కేంద్రాన్ని సైతం తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాల్లో సిబ్బంది, మధ్యవర్తులు, ఏజెంట్లు, అధికారుల మధ్య అనేక అనధికారిక ఆర్థిక లావాదేవీలు, వాట్సాప్ చాట్‌లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. చాలా మీ సేవా కేంద్రాలు దరఖాస్తుదారుల నుండి అధిక మొత్తాలను వసూలు చేస్తున్నట్లు వారి విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో, మీ సేవా కేంద్రాల్లో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు కోరారు.



