బిసి కార్పొరేషన్ల చైర్మన్ పదవులను భర్తీ చేయాలి
విశ్వంభర, బషీర్ బాగ్: రాష్ట్రంలో బిసిల ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్ల పదవులను భర్తీ చేయాలని తెలంగాణ జనసమితి బిసి విభాగం కన్వీనర్ అంబర్పేట్ జశ్వంత్ కోరారు. గురువారం హైదరాబాద్ బషీరాబాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బిసి ఫెడరేషన్ కులాల సమితి అధ్యక్షులు బెల్లాపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జశ్వంత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిసి కులాల సమగ్రాభివృద్ధికి ఫెడరేషన్లు, కార్పొరేషన్ల ఏర్పాటు అవసరమన్నారు. బిసి నిరుద్యోగ యువతకు ఉపాధి నిమిత్తం రాయితీ రుణాలను కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు కార్పొరేషన్లకు పాలకమండలిని నియమించాలని కోరారు. అలాగే కొత్తగా కార్పొరేషన్ లు, ఫెడరేషన్ లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కామారెడ్డి బిసి డిక్లరేషన్ ను అమలు చేయాలని జశ్వంత్ విజ్ఞప్తి చేశారు. బిసిలు తమ హక్కులు, డిమాండ్లను సాదించుకోవాలంటే బిసిలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బిసి కులాల్లో అత్యంత వెనుకబడ్డ నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, మేదరి, కుమ్మరి, బోయ, పూసల సగర, వడ్డెర, బట్రాజు, మేరు గంగ పుత్ర కులాలకు కార్పొరేషన్లకు ఏర్పాటు చేసి, బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జశ్వంత్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సమితి నేతలు సారోళ్ల సోమ వంశ క్షత్రియ ప్రవీణ్, జాజే రావు వేదాకర్, మహిళాకమిటీ అధ్యక్షురాలు బైరాగి అరుణ. ప్రధాన కార్యదర్శి పిల్లి స్వప్న కోశాధికారి బి.నవనీత తదితర నేతలు పాల్గొన్నారు.



