మారుతున్న జీవనశైలితో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్

మారుతున్న జీవనశైలితో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్

  • మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ కంచర్ల

విశ్వంభర, హనుమకొండ: ఒకప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే కేవలం ధూమపానానికి మాత్రమే సంబంధించిందని భావించేవారని కానీ ప్రస్తుతం ధూమపానం చేయని వారిలో  కూడా ఈ వ్యాధి ఎక్కువగా నిర్ధారణ అవుతుండటం వైద్య నిపుణులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు  కన్సల్టెంట్-సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ కంచర్ల అన్నారు.  దీనితో పాటు, జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే వంశపారంపర్య క్యాన్సర్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయని,ఇవి తరచుగా వ్యాధి తీవ్రమయ్యే దశ వరకు గుర్తించబడవని  మారుతున్న జీవనశైలి, పర్యావరణ కారకాలు జన్యు ఉత్పరివర్తనలు  ఈ వ్యాధుల పెరుగుదలకు  కారణమవుతున్నాయని తెలిపారు.   గురువారం హానుమకొండ యశోదా హాస్పిటల్లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాన్సర్ పై  అవగాహన, ముందస్తు గుర్తింపు సరైన సమయంలో చికిత్స అందడం గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందన్నారు. ఆంకాలజీ విభాగంలో వస్తున్న అధునాతన పద్ధతులు క్యాన్సర్ నిర్ధారణ చికిత్సలో ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చిందన్నారు. నెక్స్ట్-జనరేషన్ సీక్వెన్సింగ్ , పాలిమరేజ్ చైన్ రియాక్షన్ వంటి అత్యాధునిక రోగనిర్ధారణ సాధనాలు ఇప్పుడు క్యాన్సర్ వ్యాప్తికి కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనలను ఖచ్చితంగా గుర్తించడానికి వీలు కల్పిస్తున్నాయన్నారు. ఈ సాంకేతికతలు ముందస్తు గుర్తింపులో సహాయపడటమే కాకుండా, వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళికలను రూపొందించడంలో మార్గనిర్దేశం చేస్తాయి. 'లిక్విడ్ బయాప్సీ' అని పిలువబడే ఒక సాధారణ రక్త పరీక్ష, మినిమల్లీ ఇన్వాసివ్ సమర్థవంతమైన స్క్రీనింగ్ సాధనంగా ఉద్భవిస్తోంది. ఇది జన్యుపరమైన ముప్పు ఉన్న కుటుంబ సభ్యులకు ముందస్తు స్క్రీనింగ్ నివారణ సంరక్షణను అందించడానికి సహాయపడుతుందన్నారు. తీవ్రమైన దశలో ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స పద్ధతులు ఇప్పుడు సాధారణ కీమోథెరపీకి మించి అభివృద్ధి చెందాయన్నారు. టార్గెటెడ్ థెరపీ ఇమ్యునోథెరపీలు పేషేంట్ల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయని తెలిపారు.

Tags: