మంత్రుల కమిటీ గ్రామాలను సందర్శించాలి
- మంత్రుల సబ్ కమిటీకి మూసీ పరిరక్షణ సమితి లేఖ
విశ్వంభర, ఘట్కేసర్: గురువారం మూసీ పరివాహక గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ కు చెందిన మూసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బట్టె శంకర్ ఆధ్వర్యంలో మంత్రుల కేబినెట్ సబ్ కమిటీకి ఆన్‌లైన్ ద్వారా వినతి పత్రం సమర్పించారు. మూసీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లకు ఈ వినతి పత్రాన్ని పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు జిల్లాల్లోని 20 మండలాలు, వందకు పైగా గ్రామాల ప్రజల జీవనం పూర్తిగా మూసీ నదిపై ఆధారపడి ఉందన్నారు. గత మూడు దశాబ్దాలుగా మూసీ నది కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నది శుద్ధీకరణ, పునరుజ్జీవనం చర్యలను స్వాగతించినప్పటికీ, ప్రాజెక్ట్ అమలు విధానంపై గ్రామీణ ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ముందస్తు సమాచారం లేకపోవడం, భవనాల కూల్చివేతలపై వస్తున్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పలు డిమాండ్లు చేశారు. మంత్రుల కమిటీ గ్రామాలను సందర్శించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని, ప్రాజెక్టులో స్థానికులను భాగస్వాములుగా చేయాలని గౌరెల్లి నుంచి సూర్యపేట ప్రాజెక్టు వరకు విస్తరించాలని, దిగువన ఉన్న 70 గ్రామాల అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, పాత సాగునీటి కాలువలు, కత్వాలను పునరుద్ధరించాలని సూచించారు. అదేవిధంగా చెరువులలోని కాలుష్య మట్టి తొలగించాలని, మత్స్యకారులు, యాదవులు, గౌడలు, రైతులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని . కులవృత్తుల అభివృద్ధికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి క్లస్టర్‌కు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ వినతులను సానుకూలంగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ తో పాటు బాలరాజ్ గౌడ్, చిలువేరి ఐలయ్య, గుండోళ్ళ లింగస్వామి, పూలమోని బసవయ్య, సిరిపని ఐలయ్య, మల్యాల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.



