కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి
- ప్రొ. హరగోపాల్
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులందరికి 2011 చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని ప్రొ. హరగోపాల్ డిమాండ్ చేశారు. గురువారం హైదరబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ, తెలంగాణలో కౌలు రైతులను గుర్తిస్తామని, పథకాలన్ని వారికి వర్తింప చేస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం విఫలం చెందిందన్నారు. తెలంగాణలో 22 లక్షలకు పైగా కౌలు రైతులున్నారని వారికి ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ మాట్లాడుతూ... అన్నదాతలైన కౌలు రైతులను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. అనేక మంది కౌలు రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ... ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొ. కోదండరాం, ఇస్సా కిరణ్, బి. కొండల్రెడ్డి, కొండవీటి సత్యవతి, పి. శంకర్, ప్రా. అరిబండి ప్రసాదరావు, నాగయ్య, ఎం. ఆంజనేయులు, జక్కుల వెంకటయ్య, రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.



