అధికారుల తీరుపై సర్పంచుల ఆగ్రహం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని మండల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం రోజు జరిగిన 99 రోజుల ప్రణాళిక సమావేశంలో మండలంలోని గ్రామాల సర్పంచులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులతో మహిళా సంఘ భవనాల కేటాయింపులో అధికార పార్టీ గ్రామాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి, ప్రతిపక్ష గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పలు గ్రామాల్లో మహిళా సంఘాలు ఎక్కువగా ఉన్నప్పటికీ నిధులు కేటాయించకపోవడం, కేటాయింపు వివరాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన సౌకర్యాలు లేక సర్పంచులు స్వంత ఖర్చులతో నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. ఐకెపి సెంటర్ల ప్రారంభోత్సవాలకు సర్పంచులను పిలవకపోవడం, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో సమాచారం ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని, నిధుల పంపిణీలో వివక్ష ఉండదని హామీ ఇచ్చారు.



