సాగుభూముల మళ్లింపుతో పర్యావరణానికి ముప్పు
- ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎస్.సి.హెచ్. రంగయ్య
విశ్వంభర, హైదరాబాదు : సాగుభూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.సి.హెచ్. రంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆహార ఉత్పత్తి తగ్గుతున్న సమయంలో విలువైన వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మళ్లించడం భవిష్యత్తులో ఆహార సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు భారీగా సాగుభూములను స్వాధీనం చేసుకోవడం వల్ల వ్యవసాయ రంగం దెబ్బతింటోందని తెలిపారు. కొత్త లేఅవుట్లలో 40 శాతం మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఇచ్చి, మిగిలిన 60 శాతం పచ్చదనానికి కేటాయించేలా నిబంధనలు తీసుకురావాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి బాధ్యతగా తీసుకోవాలని కోరారు. వెంచర్లలో పచ్చదనం లేకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం కమిటీ ఏర్పాటు చేయాలని, బిల్డర్ల వైఫల్యంపై త్వరలో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.



