రోడ్డు భద్రతపై అవగాహన
సూర్యాపేటలో ‘అరైవ్ అలైవ్'
విశ్వంభర, సూర్యాపేట: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో న్యూ బస్ స్టాండ్ వద్ద ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ సీఐ వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్‌కు ఆటో, క్యాబ్ డ్రైవర్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్ మాట్లాడుతూ, డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. అతివేగం, అజాగ్రత్త వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని, వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంవీఐ విక్రమ్ మాట్లాడుతూ, వాహనాల ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడకూడదని, ట్రాఫిక్ నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ ఎస్సై సాయిరాం మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రవాణా శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



