నిర్లక్ష్యంగా వాహనాలు నడప వద్దు
- వాహన డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, సి.పి.ఆర్ పై శిక్షణ
- ఐ.జి రమేష్ నాయుడు
విశ్వంభర, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్స్‌లో జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఇతర వాహన డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ, కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మొత్తం సుమారు 1000 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రోడ్డు భద్రత, రైల్వేస్ ఐజీ రమేష్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎస్పీ డా. శబరీష్ ఐజీ కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. కేసముద్రం సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ డా. శబరీష్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుండి ఎలా సమర్థవంతంగా అమలు చేస్తున్నారో ఫోటోల ద్వారా వివరించారు. అనంతరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల వీడియోలను అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రదర్శించి, ప్రాణాల విలువ మరియు ప్రమాదాలకు దారితీసే పొరపాట్లపై అవగాహన కల్పించారు. తోర్రూరు సీఐ గణేష్ మాట్లాడుతూ సురక్షిత డ్రైవింగ్ విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పుల గురించి వివరించగా, మోటార్ వాహన ఇన్స్పెక్టర్ సాయి చరణ్ గారు డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం, వాహన పత్రాల నిర్వహణ, వంపుల్లో,సూటి రహదారుల్లో పాటించాల్సిన వేగ పరిమితులు, వాహన నియంత్రణపై అన్ని వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రవి రాథోడ్ మాట్లాడుతూ డ్రైవర్లు ఎల్లప్పుడూ అత్యవసర నంబర్లు కలిగి ఉండాలని సూచిస్తూ, ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పేర్కొంటూ ఆ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు మరియు ఇతర వాహన డ్రైవర్లు కేవలం ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేవారే కాకుండా ప్రమాదాల సమయంలో ముందుగా స్పందించే ప్రాణదాతలని తెలిపారు. ప్రతి డ్రైవర్‌కు సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరిగా ఉండాలని, తెలియనివారు నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్ని వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి కళ్లద్దాలు అందించడం, అలాగే సీపీఆర్ శిక్షణ ఇవ్వడం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం ఐజీ రమేష్ నాయుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రోడ్డు ప్రమాదాల విషయంలో దేశంలో 8వ స్థానంలో ఉందని తెలిపారు. రోజుకు సుమారు 70 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, దాని ప్రభావాన్ని నెలవారీ, వార్షిక స్థాయిలో వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదని, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరిగా చేయాలని సూచించారు. అలాగే డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం పూర్తిగా నివారించాలని, అలసటగా ఉన్నప్పుడు వాహనం నడపకూడదని హెచ్చరించారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, ప్రతి వాహన డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ప్రాణ నష్టం తగ్గుతుందని అన్నారు. తన అనుభవాలను పంచుకుంటూ అన్ని వర్గాల డ్రైవర్లు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఐజీ రమేష్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిల్లా ఎస్పీ డా. శబరీష్ల చేతుల మీదుగా డ్రైవర్లకు కళ్లద్దాలు పంపిణీ చేశారు.



