బీసీ రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం పై ఒత్తిడి
విశ్వంభర భూపాలపల్లి జూలై 17 : - రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను జనాభా దమాషా ప్రకారం పెంచే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. బుధవారం అయినా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీలకు తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సమగ్ర కులగణన చేపట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతంకు బీసీ రిజర్వేషన్లను పెంచుతామని స్పష్టమైన హామీనిచ్చిందని, ఇచ్చిన హామీని ఎన్నికల్లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను ప్రభుత్వానికి గుర్తు చేయడానికి, ప్రభుత్వం పైన నిరంతరం ఒత్తిడి పెంచడానికి, బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి నుంచే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీసీ కుల సంఘాల ఐకాస ఆధ్వర్యంలో సమగ్ర కులగణన సాధన యాత్రను నిర్వహిస్తున్నామని, ఈ యాత్ర ఈనెల 14న కామారెడ్డి నుంచి ప్రారంభమై కరీంనగర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజుల పాటు ఉంటుందన్నారు. ఈనెల 18న హన్మకొండ హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్ లో సమగ్ర కులగణన సాధన యాత్ర సభ ఉంటుందని, ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీసీ కులస్తులందరూ, కులాల కతీతంగా, పార్టీలకతీతంగా ఏకమై సమగ్ర కులగణన సాధన యాత్ర సభలో అత్యధికంగా పాల్గొని, బీసీల ఐక్యతను చాటాలని వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు.