రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సీఎం Vs ఒరిజినల్ కాంగ్రెస్
నైనీ బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణకు హరీష్ రావు డిమాండ్
సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్, బీజేపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నైనీ బ్లాక్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి, ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఈ టెండర్లు సాగుతున్నాయని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు.
ఆరు గ్యారంటీలు గాలికొదిలేశారు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు కేవలం కమీషన్లు, వాటాల కోసమే కొట్టుకుంటున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల టెండర్లు, గనుల కేటాయింపుల్లో వాటాల కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన అంతర్గత పోరు..
రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ముదిరిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. "రాష్ట్రంలో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ సీఎంకు, అసలైన కాంగ్రెస్ వాదులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది" అని ఆయన ఆరోపించారు. పాలనపై పట్టు కోల్పోయి, గ్రూపు రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. పారదర్శకత లేని టెండర్లను వెంటనే రద్దు చేయాలని, గనుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు తలమానికమైన సింగరేణిని కాపాడాలని అన్నారు.



