మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి సందడి

మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు 

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి సందడి

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ప్రాంగణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ప్రాంగణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా ఆదివాసీలు డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పూలు, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల ప్రభుత్వం సుమారు రూ. 101 కోట్ల వ్యయంతో చేపట్టిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ఆధునీకరణ పనులను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా గద్దెల ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన తీరును ఆయన పరిశీలించారు.

మనవడితో కలిసి తులాభారం.. 
వనదేవతల గద్దెల వద్ద సీఎం తొలి మొక్కు సమర్పించారు. ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సీఎం తన మనవడు రేయాన్ష్‌ తో కలిసి తులాభారం తూగడం. మొక్కులో భాగంగా దేవతలకు తన బరువుకు సమానమైన 68 కిలోల బెల్లాన్ని (బంగారం) అమ్మవార్లకు సమర్పించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వనదేవతలను వేడుకున్నట్లు సీఎం తెలిపారు. మేడారం జాతరను కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిరిజనుల ఆచారాలకు భంగం కలగకుండా అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాంమని రేవంత్ రెడ్డి తెలిపారు. 

Read More సక్సెస్ ఫుల్ గా వైబ్రేంట్ సీట్ స్కాలర్షిప్ టెస్ట్.

విదేశీ పర్యటనకు సీఎం..
మేడారం పర్యటన ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా విదేశీ పర్యటనకు బయలుదేరారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొని, రాష్ట్రానికి పెట్టుబడుల సేకరణే ధ్యేయంగా ఆయన అక్కడ పర్యటించనున్నారు. సీఎం పర్యటన ముగిసిన వెంటనే సాధారణ భక్తులను వనదేవతల దర్శనానికి అధికారులు అనుమతించారు.