శనిగరం ప్రాజెక్టులో 'మత్స్య' సిరి
మత్స్య సంపద ప్రకృతి ప్రసాదించిన వనరు అని.. మత్స్యకారుల ఆర్థిక పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మత్స్య సంపద ప్రకృతి ప్రసాదించిన వనరు అని.. మత్స్యకారుల ఆర్థిక పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టులో మత్స్య అభివృద్ధి పథకం కింద 100 శాతం రాయితీతో రొయ్యలు, చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నిర్మల, స్థానిక సర్పంచులు, ముదిరాజ్ సంఘ నాయకులు, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను పొన్నం ప్రభాకర్ వివరించారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో నియోజకవర్గంలోని 166 చెరువుల్లో 38.92 లక్షల చేప పిల్లలను విడుదల చేయడమే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే 26 చెరువుల్లో 26.69 లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.46.08 లక్షలు ఖర్చు చేసిందన్నారు. శనిగరం రిజర్వాయర్‌లో 9.87 లక్షల చేప పిల్లల కోసం రూ. 17.04 లక్షలు, అలాగే 4 లక్షల రొయ్య పిల్లల కోసం రూ.84 లక్షలను ప్రభుత్వం వెచ్చించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
రాజీవ్ రహదారిపై మోడల్ ఫిష్ మార్కెట్
రాజీవ్ రహదారిపై ప్రయాణించే హైదరాబాద్, కరీంనగర్, గోదావరిఖని ప్రజల కోసం అత్యాధునిక ఫిష్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన స్థల సేకరణ పూర్తయ్యాక త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, చేప పిల్లలు వరదలకు కొట్టుకుపోకుండా ఉండటానికి ఇకపై వరదలు తగ్గిన తర్వాతే వాటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.బద్దిపడగ - గుండారెడ్డిపల్లె రహదారిపై బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో శానిటేషన్, పచ్చదనం పెంచే పనుల్లో స్థానికులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.



