కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దపీట వేయండి
విశ్వంభర బ్యూరో: దేశ రాజధానిలో జరిగిన బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర గళాన్ని బలంగా వినిపించారు. 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే రాష్ట్రాల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ, తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత 200 బిలియన్ డాలర్ల నుండి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని భట్టి వివరించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5.1 శాతం నుండి 10 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు కేంద్ర సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు.
భారీ ప్రాజెక్టులకు నిధులు
తెలంగాణ జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం భట్టి విక్రమార్క కీలక ప్రాజెక్టుల జాబితాను కేంద్రం ముందు ఉంచారు. ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేసి నిధులు కేటాయించాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం రూ.14,100 కోట్లు, మురుగునీటి పారుదల పనులకు రూ.17,212 కోట్లు మంజూరు చేయాలని తెలిపారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరారు. హైదరాబాద్‌లో IIM ఏర్పాటుతో పాటు, అన్ని జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలను నెలకొల్పాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
ద్రవ్యలోటు పరిమితిని పెంచాలి
రాష్ట్రాల ద్రవ్యలోటు పరిమితిని కనీసం 4 శాతానికి పెంచాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సెస్‌లు, సర్‌ఛార్జీలను పన్నుల్లో కలిపి రాష్ట్రాలకు 41% వాటా దక్కేలా చూడాలని కోరారు. విద్య & ఆరోగ్యం ఈ రంగాల ఖర్చును FRBM పరిమితుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చి, సాయాన్ని రెట్టింపు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కేంద్రం తన మొత్తం వ్యయంలో 20 శాతానికి పైగా రాష్ట్ర జాబితా అంశాలపై ఖర్చు చేస్తోందని, అందులో కొంత తగ్గించి సుమారు రూ.2.21 లక్షల కోట్లను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేయాలని భట్టి సూచించారు. బడ్జెట్ తయారీలో రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవడం 'వికసిత్ భారత్' లక్ష్య సాధనకు నాంది అని ఆయన కొనియాడారు.



