Komati Reddy Venkat Reddy: అప్పుడే సగం చచ్చా...సరిపోదనకుంటే విషమిచ్చి చంపేయండి: మంత్రి కోమటిరెడ్డి భావోద్వేగం..!!

Komati Reddy Venkat Reddy: అప్పుడే సగం చచ్చా...సరిపోదనకుంటే విషమిచ్చి చంపేయండి: మంత్రి కోమటిరెడ్డి భావోద్వేగం..!!

విశ్వంభర తెలంగాణ, బ్యూరో: నల్గొండ జిల్లా మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై, అలాగే ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై సోషల్ మీడియా, కొన్ని టీవీ ఛానళ్లలో వస్తున్న ప్రచారాలపై మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నల్గొండ జిల్లా మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై, అలాగే ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై సోషల్ మీడియా, కొన్ని టీవీ ఛానళ్లలో వస్తున్న ప్రచారాలపై మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై, మహిళా అధికారులపై ప్రేమాయణం అంటూ సాగుతున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి ఆధారాలు లేని ఈ రాతలు కుటుంబాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, రేటింగ్‌లు, వ్యూస్ కోసం ఇలాంటి నిరాధార కథనాలు ప్రచారం చేయడం అత్యంత బాధాకరమన్నారు.

చానళ్ల మధ్య పోటీ కోసం మహిళా ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అని మంత్రి ప్రశ్నించారు. మహిళా అధికారులపై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని, ఏదైనా విమర్శ చేయాలనుకుంటే తనపైనే చేయాలని, కానీ కష్టపడి ఐఏఎస్ స్థాయికి చేరిన మహిళల గౌరవాన్ని దెబ్బతీయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, ఇలాంటి అడ్డగోలు రాతలు వారి వ్యక్తిగత జీవితాలను నాశనం చేస్తాయని హితవు పలికారు.

Read More చలాన్ పడితే అకౌంట్‌లో డబ్బులు కట్

మీడియా రంగంలో ఉన్న చాలా మంది తనకు వ్యక్తిగతంగా తెలిసిన వారేనని, తనతో స్నేహపూర్వకంగా ఉన్నవారే ఇలాంటి వార్తలు రాయడం మరింత బాధ కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలతో తనను మానసికంగా హింసిస్తున్నారని, తన కుమారుడు మరణించిన రోజే తాను సగం చనిపోయినట్టేనని భావోద్వేగంగా చెప్పారు. అప్పుడే రాజకీయాలు వదిలేయాలనుకున్నానని, కానీ తన కుమారుడి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు.

ఇలాంటి తప్పుడు కథనాల వల్ల ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పిన మంత్రి, ఇంకా సరిపోదు అనుకుంటే విషమిచ్చి చంపేయండని తీవ్ర వేదనతో వ్యాఖ్యానించారు. తన ఫోన్ నంబర్ మార్చేశానంటూ వచ్చిన వార్తలు కూడా అబద్ధమని స్పష్టం చేశారు. ఆ నంబర్‌ను ఇరవై ఏళ్లుగా వాడుతున్నానని, అందరికీ అదే తెలిసి ఉండటంతో పీఏ వద్ద ఉంచానని వివరించారు. తనకు గొంతు సంబంధిత ఆరోగ్య సమస్య ఉందని, అందుకే తక్కువగా మాట్లాడుతానని తెలిపారు.

మహిళలు ఐఏఎస్, ఐపీఎస్‌లు కావడమే తప్పా? అని ప్రశ్నించిన మంత్రి, ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరిన అధికారులపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీల్లో తన జోక్యం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ల బదిలీలు పూర్తిగా ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ పరిధిలో జరిగే ప్రక్రియ అని చెప్పారు. తన మంత్రిత్వ కాలంలోనే నల్గొండ జిల్లాలో పలుమార్లు కలెక్టర్లు మారిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం తరపున సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. నిరాధార ఆరోపణలతో వ్యక్తుల గౌరవాన్ని, కుటుంబాల మనశ్శాంతిని దెబ్బతీయొద్దని మీడియాకు మరోసారి విజ్ఞప్తి చేశారు.