సమీకృత సాగుతో ఆరోగ్యం
- జిల్లా సేంద్రియ ఆదర్శ రైతు వెంకన్న పటేల్
విశ్వంభర,ఇనుగుర్తి:సమీకృత వ్యవసాయం అందరికీ శ్రేయస్కరమని జిల్లా సేంద్రియ ఆదర్శ రైతు, తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాల ప్రకృతి వ్యవసాయ రూపకర్త పాలేకర్ శిష్యులు విజయ్ రామ్ చే సన్మాన గ్రహీత పెండెం వెంకన్న పటేల్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన వెంకన్న పటేల్ బుధవారం తన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలోని బావిలో పెంచిన చేపలను చూపెడుతూ సమీకృత సాగుపై మాట్లాడారు. కర్షకులు తమ సాగుభూములలో ఓ గదిని ఏర్పాటు చేసుకుని నాటు కోళ్లను, వ్యవసాయ బావిలో చేపలను పెంచాలన్నారు. దీంతో కల్తీ లేని మాంసాహారాన్ని పొందవచ్చు అన్నారు. పలు రకాల కూరగాయలను పండించాలని చెప్పారు. ప్రతి రైతు గోవును పెంచుకున్నట్లయితే సేంద్రియ వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరమని, ఆవు పాలు ప్రజలకు ఆరోగ్య దాయకమన్నారు. తాను 20 సంవత్సరాలుగా గో ఆదారిత వ్యవసాయానికి పాల్పడుతూ ఆరోగ్య పరిపుష్టతను పొందుతున్నట్లు వివరించారు. రసాయన సాగుతో గంటలకు మేలు చేసే క్రిమి కీటకాలు నశిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ ఎరువులు, పురుగుమందులతో పండిన పంటల తో అనారోగ్యాల బారిన పడుతున్నట్లు పలు సర్వేలు సూచిస్తున్నట్లు గుర్తు చేశారు. గోఆధారి, సమీకృత సాగును ప్రతి రైతు చేపట్టాలని కోరారు.



