తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్రం భారీ నిధులు: కిషన్ రెడ్డి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో తెలంగాణలోని గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలకు రూ.11 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు.
2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,060 కోట్లను కేటాయించగా, 2020-21 నుంచి 2025-26 మధ్య ఈ కేటాయింపులు దాదాపు 80 శాతం పెరిగి రూ.9,050 కోట్లకు చేరాయని తెలిపారు. ఇందులో ఇప్పటికే రూ.6,051 కోట్లను విడుదల చేసినట్లు వివరించారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేస్తే పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం నమ్ముతోందని ఆయన అన్నారు.
ఇటీవల తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో మిగిలిన నిధుల విడుదలకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చులపై యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించడంతో, 2024-25 సంవత్సరానికి తొలి విడతగా రూ.260 కోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. తదుపరి దశల్లో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందగానే మరో రూ.2,500 కోట్ల నిధులు దశలవారీగా విడుదల కానున్నాయని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి గ్రామపంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి, PFMS పోర్టల్‌లో నమోదు చేసుకుని యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాల్సి ఉంటుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీల ఖాతాలను జప్తు చేసి నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన విమర్శించారు. ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని, కేంద్రం అందిస్తున్న నిధులను గ్రామాభివృద్ధికి సమర్థంగా వినియోగించాలని కిషన్ రెడ్డి కోరారు.




