మహిళా ఐఏఎస్‌పై అసభ్య ప్రచారం: రంగంలోకి 'సిట్'

సజ్జనార్ నేతృత్వంలో విచారణ 

మహిళా ఐఏఎస్‌పై అసభ్య ప్రచారం: రంగంలోకి 'సిట్'

తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిణిని కించపరిచేలా సోషల్ మీడియాలో సాగుతున్న అసత్య ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిణిని కించపరిచేలా సోషల్ మీడియాలో సాగుతున్న అసత్య ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నారాయణపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి, మహిళా ఐఏఎస్ అధికారిణి గౌరవానికి భంగం కలిగించేలా, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను అసభ్యకరంగా చిత్రీకరించి పోస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న కేసు నమోదైంది. మరోవైపు, తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కూడా సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

సజ్జనార్ నేతృత్వంలో హై-లెవల్ టీమ్ 
ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను హైదరాబాద్ సిటీ సీపీ వి.సి. సజ్జనార్‌ కు అప్పగించారు. ఈ బృందంలో జాయింట్ సీపీ శ్వేత, డీసీపీలు యోగేష్ గౌతమ్, వెంకట లక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద బాబు, ఏసీపీ గురు రాఘవేంద్ర, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్, సైబర్ సెల్ సీఐ శంకర్ రెడ్డి, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్ఐ హరీశ్ ఉన్నారు. 

Read More సన్ షైన్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

డీజీపీ స్పష్టమైన ఆదేశాలు
సోషల్ మీడియా వేదికగా మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే, దర్యాప్తును వీలైనంత వేగంగా పూర్తి చేసి, దోషులపై తక్షణమే చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని డీజీపీ ఈ బృందాన్ని ఆదేశించారు. టెక్నాలజీ సాయంతో ఈ పోస్టుల వెనుక ఉన్న సూత్రధారులను కూడా గుర్తించే పనిలో సిట్ నిమగ్నమైంది.