స్ట్రేషన్ ఆఫీసుల్లో బ్రోకర్లదే హవారిజి
విశ్వంభర, సంగారెడ్డి: జిల్లాలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ ఆశయాలకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, మధ్యవర్తులు మాత్రం చక్రం తిప్పుతున్నారు. పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం సంగారెడ్డి జిల్లాలో అభాసుపాలవుతోంది. సర్వర్ సమస్యల సాకుతోనో, ఇతర సాంకేతిక కారణాలతోనో సామాన్యులకు స్లాట్లు దొరకడం గగనమవుతోంది. తీరా స్లాట్ దొరికి ఆఫీసుకెళ్తే.. అక్కడ గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కానీ, బ్రోకర్ల ద్వారా వచ్చే వారికి మాత్రం నిమిషాల్లో పని అయిపోతుండటం గమనార్హం. రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద బ్రోకర్ల హవా ఏ రేంజ్ లో ఉందంటే.. "వారు ఎంత చెబితే అంత.. వారు ఎప్పుడు చెబితే అప్పుడే" అన్నట్లుగా పరిస్థితి మారింది. రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా, అదనపు 'మామూళ్ల' కోసం బ్రోకర్లు డిమాండ్ చేస్తున్నారు. డాక్యుమెంట్లలో చిన్న చిన్న తప్పులను సాకుగా చూపి తిరస్కరిస్తామంటూ భయపెట్టి, వసూళ్లకు పాల్పడుతున్నారు. కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది అండదండలతోనే ఈ బ్రోకర్ల వ్యవస్థ యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిస్సహాయ స్థితిలో జనాలు, దూర ప్రాంతాల నుండి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చే ప్రజలు, అధికారుల చుట్టూ తిరగలేక, పని అవ్వక చేసేదేమీ లేక బ్రోకర్లు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. "స్లాట్ బుక్ చేసుకున్నా మా పని అవ్వడం లేదు.. అదే బ్రోకర్ ని కలిస్తే వెంటనే అయిపోతోంది" అని పలువురు బాధితులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సంగారెడ్డి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, బ్రోకర్ల వ్యవస్థకు చరమగీతం పాడి సామాన్యులకు ఊరట కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.



