అక్రమ అరెస్టులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
విశ్వంభర, చండూర్ మండలం:- శుక్రవారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముట్టడి సందర్బంగా పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమని BJYM రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి రు,బిజెపి చండూర్ పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బిజెపి నాయకులను అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరుగ్యారంటీలు,420 హామీలను అమలు చేయకుండా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు.దీన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే బిజెపి ఆధ్వర్యంలో మరింత ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.



