గిరిజన క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు టెస్టులు పూర్తి
విశ్వంభర, భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన బ్యాటరీ టెస్టుల ద్వారా విద్యార్థుల ఎంపిక పూర్తయిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. కిన్నెరసాని, కచేనపల్లి క్రీడా మైదానాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజన బాలబాలికలకు మొత్తం 9 రకాల బ్యాటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఆధారంగా కచేనపల్లి క్రీడా పాఠశాలలో 40 మంది బాలికలు, కిన్నెరసాని క్రీడా పాఠశాలలో 40 మంది బాలురను ఎంపిక చేసి 5వ తరగతిలో ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ దమ్మపేట ఏటిడిఓ చంద్రమోహన్, క్రీడల అధికారి గోపాలరావు, ఏసీఎంఓ రాములు, ఏఎస్ఓ వెంకటనారాయణ, రాంబాబు, 9 మంది పీడీ, పీఈటీ ల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించారు. ఎంపికలలో కిన్నెరసాని క్రీడా పాఠశాల బాలుర విభాగంలో 105 మంది, కచేనపల్లి క్రీడా పాఠశాల బాలికల విభాగంలో 72 మంది పాల్గొన్నారు. అన్ని పరీక్షలను సమగ్రంగా నిర్వహించి ప్రతిభావంతులైన 80 మంది విద్యార్థులను (ప్రతి పాఠశాలలో 40 మంది చొప్పున) ఎంపిక చేశారు.



