కళల పరిరక్షణకు సాంస్కృతిక సంస్థలు అవసరం

కళల పరిరక్షణకు సాంస్కృతిక సంస్థలు అవసరం

విశ్వంభర, హిమాయత్ నగర్ : సాంస్కృతిక సంస్థలు కళల పరిరక్షణకు ఎంతో అవసరమని, కొత్తగా మరిన్ని సంస్థలు స్థాపించబడటం సంతోషకర విషయమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి అన్నారు. హైదరాబాదు హిమాయత్ నగర్ లోని శ్రీముఖి కాంప్లెక్స్‌లోని శారద స్టూడియోస్‌లో కెవీకే ఫైన్ ఆర్ట్స్ అండ్ మెలోడీస్ సంస్థ ప్రారంభ సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ సి.ఎన్. గోపినాథ్ రెడ్డి, ఏనుగు నరసింహా రెడ్డి, వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజుతో కలిసి దీపారాధన చేసి సంస్థను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ,  కప్పా కృష్ణమోహన్ ఉన్నత విద్యావంతుడిగా బ్యాంక్ అధికారిగా సేవలందించి, దూరదర్శన్‌లో న్యూస్ రీడర్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితుడని తెలిపారు. ఆకాశవాణి తదితర మాధ్యమాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలతో అనుబంధం ఉన్న కృష్ణమోహన్ కెవీకే పేరిట సంస్థ ప్రారంభించడం శుభ సూచకమని పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా సాంస్కృతిక రంగంతో అనుబంధం ఉన్న వంశీ రామరాజు సంస్థకు తోడ్పాటు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వంశీ రామరాజు, గాయకుడు విజయ్ మండపాక, బ్యాంక్ అధికారి శ్రీనివాస్ రావు, స్టార్ 9 న్యూస్ చానెల్ షాబుదిన్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ స్థాపకుడు కృష్ణమోహన్ నివేదిక సమర్పించగా, కార్యదర్శులు జ్యోతిర్మయి, శ్రీలత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Tags: