అక్షరాలతో సామాజిక మార్పు : కవి యాకూబ్
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: కవుల అక్షరాలు సామాజిక మార్పుకు ఆయుధాలుగా మారాలని, కుల వ్యవస్థను ప్రశ్నించే కవిత్వం అవసరమని కవి యాకూబ్ అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో భూపతి వెంకటేశ్వర్లు, ఎస్. వినయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కులమతాల అడ్డుగోడలను కూల్చి మానవత్వాన్ని చాటే దిశగా కవిత్వం ముందుండాలని పిలుపునిచ్చారు. కుల పునాదులపై సమాజ నిర్మాణం సాధ్యం కాదని కె. అనందాచారి పేర్కొనగా, కవిత్వం సమాజాన్ని మేల్కొలిపే శక్తిగా ఉండాలని ఎస్.కే. సలీం తెలిపారు. కార్యక్రమంలో పలువురు కవులు తమ కవితలను వినిపించారు. కార్యక్రమంలో గుప్త జ్యోత్స్న, మౌనం శ్రీ మల్లిక్ మాస్టర్ జి, వనపట్ల సుబ్బయ్య, సాధనాల వెంకటస్వామి నాయుడు, జి. యాదగిరిరావు, పుష్యమి సాగర్, మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



