చుక్కా రామయ్యకు 100వ జన్మదిన శుభాకాంక్షలు - TJS అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం
విశ్వంభర, హైదరాబాద్ :- విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి, చుక్కా రామయ్య ని కొదండరామ్ సన్మానించి, 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే వేడుకలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ , జస్టిస్ సుధర్షన్ రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి తదితరులు కూడా రామయ్య ని సన్మానించారు.ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ..నిత్య విద్యార్థి, వేలాది మంది ఇంజినీర్లను తీర్చిదిద్దిన గొప్ప గురువు, సామాజిక సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు—అలాంటి మహోన్నత వ్యక్తిత్వం గల చుక్కా రామయ్య నేడు తన 100వ జన్మదినాన్ని జరుపుకున్నారు. విద్యార్థి దశలోనే నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దుశ్చర్యలకు వ్యతిరేకంగా నిలిచిన ఆయన పోరాటం భావితరాలకు ఒక చిరస్మరణీయ స్ఫూర్తి.అంటరానిత్యం నిర్మూలన ఉద్యమంలో పాల్గొని, సమానత్వం అనే విలువలను జీవితాంతం ఆచరణలో పెట్టిన రామయ్య —విద్య, సమాజ అభివృద్ధి రంగాల్లో తనదైన ముద్ర వేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను ఐఐటీలకు చేర్చే దారిని చూపిన విద్యావేత్తగా ఆయన సేవలు అపూర్వమైనవి. గణిత బోధనలో ఆయన నైపుణ్యం, విద్యార్థుల పట్ల ఆయన నిబద్ధత వేలాది కుటుంబాలకు ఆశాజ్యోతి అయింది.ఈ శుభ సందర్భంలో చుక్కా రామయ్య కి 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన స్ఫూర్తి భావితరాలను నిరంతరం వెలుగునింపాలని ప్రొఫెసర్ కోదండరాం ఆకాంక్షించారు.



