ప్రజాసేవలో ఆదర్శంగా నిలవండి

గ్రూప్-1 విజేతలకు భట్టి విక్రమార్క పిలుపు

ప్రజాసేవలో ఆదర్శంగా నిలవండి

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం నుంచి వచ్చి, గ్రూప్-1 వంటి అత్యున్నత లక్ష్యాలను సాధించిన అభ్యర్థులు భవిష్యత్తులో ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం నుంచి వచ్చి, గ్రూప్-1 వంటి అత్యున్నత లక్ష్యాలను సాధించిన అభ్యర్థులు భవిష్యత్తులో ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. సోమవారం ప్రజాభవన్‌లో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొంది, గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు మెమంటోలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని గ్రూప్-1 సాధించడం సామాన్యమైన విషయం కాదని, మీ తల్లిదండ్రులు గర్వపడేలా, సమాజం హర్షించేలా మీ పనితీరు ఉండాలని నేతలు అభ్యర్థులను ఉత్సాహపరిచారు.

నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తోందని చెప్పారు. "మీరు పడే కష్టాన్ని, ప్రతిభను ఈ విజయం నిరూపించింది. భవిష్యత్తులో మీరు వివిధ హోదాల్లో దశాబ్దాల పాటు పని చేయబోతున్నారు. ప్రభుత్వం తీసుకునే సంక్షేమ నిర్ణయాలను చిత్తశుద్ధితో ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మీపై ఉంది" అని ఆయన పేర్కొన్నారు. తమ మూలాలను మర్చిపోకుండా, సమాజంలో వెనుకబడిన వారికి అండగా నిలవాలని సూచించారు.

Read More Uttam Kumar Reddy: కృష్ణా నీటిపై ఒక్క చుక్క కూడా వదులుకోం.. మంత్రి ఉత్తమ్..!!

అభ్యర్థుల కోసం కొత్త వసతులు
నిరుద్యోగ అభ్యర్థుల కోసం ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్ సమీపంలోని ఎకరంన్నర స్థలాన్ని అభివృద్ధి చేసి, అక్కడ అభ్యర్థుల కోసం నిరంతర విద్యా సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ స్టడీ సర్కిళ్లలో మౌలిక వసతులు మెరుగుపరిచామని, రాబోయే రోజుల్లో వీటిని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.