తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశం
విశ్వంభర, ఆమనగల్లు: ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులకు తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యలో ఈ విద్యా సంవత్సరం జూన్ నుండి ఇప్పటివరకు చేపట్టిన అన్ని కార్యక్రమాల వివరాలను ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాలలో తరగతి గదులలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ చేస్తారని, అదేవిధంగా ముఖ ఆధారిత అటెండెన్స్ ద్వారా విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని మెరుగుపరచేటట్లుగా చూడడం జరుగుతుందని చెప్పారు. ప్రతి కళాశాలలో డిజిటల్ ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో తరగతుల నిర్వహణ చేస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు అడిగిన సందేహాలను అధ్యాపకులు నివృత్తి చేశారు. రాబోయే వార్షిక పరీక్షలకు విద్యార్థులు అందరూ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి తల్లిదండ్రుల సహకారాన్ని ప్రిన్సిపాల్ , అధ్యాపక బృందం కోరారు.



