కుటుంబం సామూహిక ఆత్మహత్య
ఆ అందమైన కుటుంబం ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ.. అర్ధాంతరంగా తనువు చాలించింది. ఒకేసారి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఆ అందమైన కుటుంబం ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ.. అర్ధాంతరంగా తనువు చాలించింది. ఒకేసారి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. రైలు కిందపడి తండ్రి, తల్లి, కొడుకు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఉదంతం శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బోడుప్పల్ పరిధిలోని హరితహారం కాలనీకి చెందిన పి. సురేందర్ రెడ్డి, ఆయన భార్య విజయ, కుమారుడు చేతనా రెడ్డి.. చర్లపల్లి - ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కిందపడి ప్రాణాలు విడిచారు. ఉదయం పట్టాలపై విగతజీవులుగా పడి ఉన్న వారిని చూసిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
విచారణలో తేలాల్సిన కారణాలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి, మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా ధృవీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యలకు వెనుక ఉన్న కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులా? ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా లేదా ఇంట్లోనే వివాదాలు నడుస్తున్నాయా? ఎవరైనా వేధింపులకు గురి చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాలనీలో విషాద ఛాయలు
సురేందర్ రెడ్డి కుటుంబం అంతా ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే ఆ కుటుంబం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనా స్థలం వద్ద బంధువుల ఆర్తనాదాలు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించాయి.



