నాంపల్లి అగ్నిప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా

నాంపల్లి అగ్నిప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా

నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దుర్ఘటనపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు, ఈ ప్రమాదానికి కారణమైన భవన యజమాని సతీష్ బచాస్‌ను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో దుకాణ యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఐదుగురు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సిద్ధమవుతున్నారు.

మంత్రుల దిగ్భ్రాంతి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. యజమానుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. GHMC, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులు కలిసి పనిచేసి నగరంలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

Read More అన్నదాత ఆవేదన. - సోలిపేట ఐకేపీ కేంద్రంలో అక్రమాలు - రైతుల ఖాతాల్లో మాయమవుతున్న సొమ్ము - కలెక్టర్ స్పందించాలని బాధితుల డిమాండ్

ప్రజలకు విజ్ఞప్తి
నగరంలోని ఏ భవనంలోనైనా అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదని గుర్తిస్తే, తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కోరారు. ప్రాణనష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.