ముఖ్యమంత్రివా..? ముఠా నాయకుడివా..? కేటీఆర్ ఫైర్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఏమిటని ప్రశ్నిస్తూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఏమిటని ప్రశ్నిస్తూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి, అదే సమయంలో హోంమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు. మీరు ముఖ్యమంత్రివా, లేక ముఠా నాయకుడివా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను విస్మరించి, అసాంఘిక చర్యలను ప్రోత్సహించేలా మాట్లాడటం ద్వారా సీఎం తన హోదా, స్థాయిని తానే తగ్గించుకున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజల మనసుల్లో గులాబీ జెండాకు ఉన్న ఆదరణను చూసి ముఖ్యమంత్రికి మైండ్ బ్లాక్ అయినట్లుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా పూర్తికాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లోనే సీఎం మానసిక స్థిరత్వాన్ని కోల్పోయినట్లుగా మాట్లాడుతున్నారని, ఆయన తాజా వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా కేసులు నమోదు చేసి అరెస్టులు చేసే పోలీస్ వ్యవస్థ, ఇప్పుడు బహిరంగంగా హింసను రెచ్చగొట్టేలా మాట్లాడిన ముఖ్యమంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి, చట్టప్రకారం ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడటం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు. గత రెండేళ్లుగా తన పాత బాస్ ఆదేశాల ప్రకారమే తెలంగాణ జలహక్కులను తాకట్టు పెట్టారని విమర్శించారు. తాజాగా చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి అసలు స్వరూపం ప్రజల ముందుకు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని అర్థం చేసుకున్న రేవంత్, ఆ నావ నుంచి బయటపడేందుకు ఇప్పటినుంచే మార్గం సిద్ధం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఒకవైపు బీజేపీతో గోప్య ఒప్పందాలు చేసుకుంటూ, మరోవైపు టీడీపీని తెలంగాణపై రుద్దే ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని కేటీఆర్ హెచ్చరించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగ నియామకాల విషయంలో తెలంగాణకు ద్రోహం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన స్పష్టంగా అన్నారు.



