మహిళగా పుట్టినందుకు గర్వపడాలి
విశ్వంభర, హైదరాబాదు :మహిళా దినోత్సవం ఒకరోజు మాత్రమే జరుపుకునే వేడుక కాదని, మహిళగా పుట్టినందుకు ప్రతి రోజు గర్వపడాలని ప్రముఖ సినీనటి జమున కుమార్తె, చిత్రకారిణి స్రవంతి జూలూరి అన్నారు. వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాదు ప్రేకాస్ స్టూడియోస్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తల్లి పిల్లలకు మొదటి గురువని, వారికి సంస్కారం నేర్పే బాధ్యత మహిళలదేనని పేర్కొన్నారు. మహిళలు తమపై నమ్మకం పెంచుకుని గర్వంగా జీవించాలని సూచించారు. దూరదర్శన్ డైరెక్టర్ కామేశ్వరి మాట్లాడుతూ మహిళలు సమాజంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత వారిదేనన్నారు. అమెరికాకు చెందిన మంజు భార్గవ పురస్కారం అందుకోవడం గర్వకారణమని తెలిపారు. గైనకాలజిస్టు డాక్టర్ కావ్యప్రియ మహిళలు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో సాంస్కృతిక, సంగీత, సాహిత్య రంగాల్లో విశిష్ట సేవలందించిన 35 మంది మహిళలకు పురస్కారాలు అందజేశారు. శైలజ సుంకరపల్లి, సుధామయి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రారంభంలో సరస్వతి కరవాది ప్రదర్శించిన జమున ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది.



