ఎమ్మెల్సీ ఎన్నికకు వేళాయే.. సిరా గుర్తుపై ఈసీ కీలక నిర్ణయం!
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. రేపు ఉదయం 8.00 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. దీంతో అప్పుడు ఓటు వేసిన చాలా మంది రేపు ఓటు వేస్తారు. వారికి ఇంకా చూపుడు వేలుకు సిరా చుక్క ఇంకా ఉంటుంది. దీంతో.. ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఏడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు ఉంటుంది.
రేపటి ఎన్నికల కోసం ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు అంటించాలని పోలింగ్ సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటింగ్ సమయంలో సిరా గుర్తు విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని తెలిపింది. పొరపాటున కూడా చూపుడు వేలుకు సిరా గుర్తు వేయొద్దని స్పష్టం చేసింది. ఇక ఓటు వేసేవారు బ్యాలెట్ పత్రాలపై ఉండే అభ్యర్థులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.
నిన్నటితోనే ఈ ఎన్నిక ప్రచారం ముగిసింది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు వేయనున్నారు. దీని ఫలితం జూన్ 5న రానుంది.