‘ప్రచండ్‌’లో ప్రయాణించనున్న రాష్ట్రపతి

‘ప్రచండ్‌’లో ప్రయాణించనున్న రాష్ట్రపతి

విశ్వంభర, నేషనల్ బ్యూరో: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జైసల్మేర్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ ‘ప్రచండ్‌’లో గగన విహారం చేయనున్నారు. అనంతరం భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దు సమీపంలోని పోఖ్రాన్‌లో వైమానిక దళం ఆధ్వర్యంలో ‘వాయు శక్తి’ పేరిట నిర్వహించనున్న విన్యాసాలను వీక్షించనున్నారు.ఎల్‌సీహెచ్‌ ‘ప్రచండ్‌’ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ హెలికాప్టర్‌. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌  దీన్ని తయారుచేసింది. 2022 అక్టోబరులో వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. ఎడారుల నుంచి పర్వతాల వరకు విభిన్న ప్రాంతాల్లో దీన్ని నడపొచ్చు. 5,000 మీటర్ల పైన ఎత్తులోనూ ఎగరగలదు. ముఖ్యంగా పర్వత ప్రాంత సరిహద్దుల వెంట మోహరింపునకు ఇది అనుకూలంగా ఉంటుంది. అధునాతన ఏవియానిక్స్, స్టెల్త్ ఫీచర్లు, రాత్రి వేళల్లోనూ దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం. క్షిపణులు, రాకెట్లు, 20 ఎంఎం గన్‌ వంటి ఆయుధాలను ప్రయోగించవచ్చు. రాష్ట్రపతి ముర్ము  2023 ఏప్రిల్‌లో అస్సాంలోని తేజ్‌పుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు. గతేడాది అక్టోబరులో అంబాలాలో రఫేల్‌ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. వాయుసేనకు చెందిన రెండు వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. గతేడాది డిసెంబరులో కర్ణాటకలోని కార్వార్‌ తీరంలో కల్వరి శ్రేణి జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌’లో ప్రయాణించారు.

Tags: