బొల్లారం రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేయాలి
- కేంద్ర మంత్రికి ఈటల రాజేందర్ విన్నపం
విశ్వంభర, ఢిల్లీ : బొల్లారం రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫారమ్‌లు, వేచి ఉండే గదులు, టికెటింగ్ సదుపాయాలు, ఇతర సౌకర్యాలు తగినంతగా లేవని, ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం స్టేషన్‌ను ఆధునీకరించాలని మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాసారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న బొల్లారం రైల్వే స్టేషన్ కు ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు , ఉద్యోగులు , విద్యార్థులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు అధిక సంఖ్యలో వస్తుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద బొల్లారం రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ పథకంలో స్టేషన్‌ను చేర్చడం వల్ల ఆధునిక సౌకర్యాలు, మెరుగైన రాకపోకలు ఏర్పడి ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. హైదరాబాద్ ప్రాంతంలోని రైల్వే నెట్‌వర్క్ కూడా మరింత బలపడుతుందని పేర్కొన్నారు. బొల్లారం రైల్వే స్టేషన్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే మంత్రిని ఆయన కోరారు.



